మీకు హక్కులేదు, జైలుకెళ్తా, లాఠీ దెబ్బలు తింటా, మోడీని ఏదీ అడగలేదు, నా సత్తా చూపిస్తా: ఊగిపోయిన పవన్

0
202

అమరావతి/విశాఖ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఆయన ఉదయం తొమ్మిది గంటల సమయంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పవన్ మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటిస్తారు. 9వ తేదీన ఒంగోలులో కృష్ణా నది పడవ ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. బుధవారం ఉదయం విశాఖ చేరుకున్న పవన్ తొలుత ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించారు.. ఆ తర్వాత డీసీఐ ఉద్యోగుల దీక్షా శిబిరం వద్ద వారికి మద్దతు తెలిపారు.

ఉద్యోగులు డీసీఐ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళకు పవన్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ ఆవేదనను పవన్ కళ్యాణ్‌కు చెప్పుకున్నారు. ఇప్పటి వరకు తమ గోడును ఏ ప్రజాప్రతినిధి పట్టించుకోలేదని, ఆందోళన చేస్తున్నా మా గోడు ఎవరూ వినిపించుకోలేదని ఉద్యోగులు చెప్పారు.

నష్టాల్లో ఉన్న కంపెనీ ప్రయివేటీకరణలో తప్పు లేదు

పవన్ కళ్యాణ్ మొదట వెంకటేష్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఉద్యోగుల సమస్యలు సావధానంగా విని మాట్లాడారు. డీసీఐ ఉద్యోగులకు నైతిక మద్దతు ఇచ్చేందుకు తాను ఇక్కడకు వచ్చానని చెప్పారు. మీ బాధలు పంచుకోవడానికే వచ్చానన్నారు. నష్టాల్లో ఉన్న కంపెనీలను ప్రయివేటీకరణ చేయడం తప్పు లేదన్నారు. కానీ లాభాల్లో ఉన్న డీసీఐని ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

ఇది బాధ కలిగించింది, ఓటు అడిగే హక్కు లేదు

డీసీఐ ప్రయివేటీకరణ చాలా బాధను కలిగించిందని పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రశ్నించారు. తాను ఏ పార్టీలకు అయితే మద్దతిచ్చానో ప్రజా వ్యతిరేక పాలన చేస్తే వాటిని ప్రశ్నించేందుకు వెనుకాడనని చెప్పానని గుర్తు చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని బీజేపీ, టీడీపీలకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పారు. డీసీఐకి పలు ప్రభుత్వ రంగ సంస్థలే పెద్ద ఎత్తున బాకీపడి ఉన్నాయని చెప్పారు. అలాంటి డీసీఐను ప్రయివేటీకరించడం దురదృష్టకరమన్నారు.

నేను తెలుగు రాష్ట్రాల ప్రజల పక్షం

రాష్ట్రం విడిపోయినప్పుడు తనకు చాలా బాధ కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లైనా ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. నేను టీడీపీ లేదా బీజేపీ పక్షం కాదని చెప్పారు. నేను ప్రజా పక్షమని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజల పక్షం, దేశం పక్షం అన్నారు. నేను సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని, తాను సమస్యలను చూసి పారిపోనని చెప్పారు.

జైలుకెళ్తా, లాఠీ దెబ్బలు తింటా: మోడీ, బాబులకు పవన్

తాను బతికినంత నిజాయితీగా ఎవరూ బతకలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. కోడిగుడ్డుపై ఈకలు పీకలేరన్నారు. తనకు ధైర్యం, పోరాడే శక్తి ఉందన్నారు. జనం కోసం అవసరమైతే జైలుకు వెళ్తానని చెప్పారు. అవసరమైతే లాఠీ దెబ్బలు తింటానన్నారు.నావి ప్రాణాలు కావని, పిడికెడు మట్టి మాత్రమేనని, నా సత్తా ఏమిటో చూపిస్తానని చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టిన వాటిని ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నష్టం జరుగుతుంటే తాను మద్దతిచ్చిన పార్టీలను కచ్చితంగా నిలదీస్తానని చెప్పారు.

పదవులపై ఆశ లేదు, అనుభవం కావాలి

ప్రజా సమస్యలపై పోరాటం కోసమే తాను పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎలాంటి సమస్యలనైనా చర్చలతో పరిష్కరించుకోగలమని చెప్పారు. తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదన్నారు. అధికారానికి అనుభవం కావాలని చెప్పారు. డీసీఐ ఉద్యోగులు 9 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ కంపెనీ ఎదుగుదల వెనుక వెయ్యిమంది ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఎంపీలు హరిబాబు, అవంతి శ్రీనివాస్‌ల వలే తాను బాధ్యతను మరిచిపోనని చెప్పారు. నేను మద్దతిచ్చిన పార్టీలను నిలదీస్తానని చెప్పారు.

ప్రధానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, లేఖ పంపిస్తున్నా

తనది ఏ పార్టీ అంటే ప్రజా పార్టీ అని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఏ పార్టీకి మద్దతివ్వనని చెప్పారు. కాంగ్రెస్ నేతల్లా తాను టీ, కాఫీలు తాగి, కబుర్లు చెప్పి వెళ్లేవాడిని కాదన్నారు. తన విశ్వాసం ప్రజల కోసమే కానీ పార్టీ కోసం కాదన్నారు. జనసేన పార్టీ తరఫున తాను ప్రధాన మంత్రి మోడీకి కూడా లేఖ పంపిస్తున్నానని చెప్పారు. డీసీఐని ప్రయివేటీకరణ చేయవద్దని తాను ఈ లేఖ రాస్తున్నానని చెప్పారు.

ఇంతవరకు ప్రధాని మోడీని ఏమీ అడగలేదు

తాను ఇంత వరకు ప్రధాని మోడీని ఏదీ అడగలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ ఇప్పుడు డీసీఐ ప్రయివేటీకరణ ఆపాలని కోరుతానని చెప్పారు. ఆశించిన ఫలితం రాకుంటే మీతో కలిసి పని చేస్తానని డీసీఐ ఉద్యోగులకు చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో జనసేన తప్పించుకోదని తేల్చి చెప్పారు. జనసేన సమస్యలపై పోరాడుతుందని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.

నదులు, అరణ్యాలు కాదు

పవన్ తన పర్యటన గురించి మంగళవారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఒక దేశం సంపద ఖనిజాలు, నదులు, అరణ్యాలు కాదని, కలల ఖనిజాలతో చేసిన యువత అని, వారే దేశ భవిష్యత్తుకు నావికులు అని మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ అన్నారని పవన్ గుర్తు చేశారు.

ఉస్మానియా నుంచి ఫాతిమా వరకు

తెలుగు రాష్ట్రాల్లోని యువత నిరాశ నిస్పృహలతో ఉన్నారని, ఇది దేశానికి మంచిది కాదని, ఇటు బాసర ఐఐఐటీ, ఉస్మానియా విద్యార్థులు, అటు విజయవాడలోని ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు తీవ్ర ఆవేదనతో ఉన్నారని పవన్ కళ్యాణ్ అన్నారు.

ప్రభుత్వాలపై విమర్శలకు ఆస్కారం

వారి సమస్యలను పరిష్కరించడానికి జనసేన తన వంతు ప్రయత్నం చేస్తుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కాగా, పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఆయన ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించే అవకాశం లేకపోలేదు.

జనసేన దృష్టి కాగా,

సినిమాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇక పార్టీ పైన దృష్టి సారిస్తున్నారు. ఓ వైపు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడుతూనే మరోవైపు పార్టీని బలోపేతం చేసే అంశంపై జనసేన దృష్టి సారించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here